తిరుపతి గంగజాతర దక్షిణ భారతదేశంలో అత్యంత ప్రాచుర్యం ఉన్న ఉత్సవాల్లో ఒకటి. పారంపర్యంగా మిరాశీ కులాలు వేసే వేషాలు, ఆచారాలు, అనుష్ఠాన సన్నివేశాలు, వ్యక్తిగత నమ్మకంతో కూడుకున్న మొక్కుబళ్లు, వేషాలు పాడే బూతు పాటలు ఈ జాతర విశేషాలు. వీటి వెనుక సమాజం బలంగా నమ్మే కథలు, నమ్మకాలు, సాంస్కృతిక వైవిధ్యంతో పాటు జాతరలో ప్రధానంగా ఉపయోగించే వస్తుసంస్కృతిలో వైవిధ్యం ఉంది. గతంలో జాతర ప్రత్యేకించి పారంపర్యంగా పాల్గొనే కులాలు, సన్నిహిత సంబంధం ఉన్న సహృదయ సమూహాల సమన్వయంతో జరిగేవి, కాని కాల క్రమంలో ఆ యా ఆచారాల్లో ఉన్న శాస్త్రీయత లోపించి మొక్కుబడిగా జరుగుతున్నాయి, వాటి వెనుక ఉన్న అసలు ప్రయోజనం క్రమంగా మసకబారుతుంది.
ఈ గ్రంథం తిరుపతి గంగజాతర చారిత్రక నేపథ్యం, అనుష్ఠాన ప్రదర్శన సంప్రదాయం, కథలు గాథలు, వస్తుసంస్కృతి, వేషాలు, ఆచారాలు లాంటి అంశాల్ని క్షేత్రపరిశోధన ఆధారంగా విశ్లేషిస్తుంది. జాతరలో కనిపించే ఆచారాల వెనుక ఉన్న ప్రతీకాత్మక భావనల్ని, సామాజిక సంబంధాల్ని, సాంస్కృతిక విజ్ఞాన వ్యవస్థని, శాస్త్రీయతని వెలికితీయడానికి ప్రయత్నిస్తుంది.
జానపదవిజ్ఞానం, మానవశాస్త్రం, సాంస్కృతిక అధ్యయనాలపై ఆసక్తి ఉన్న పరిశోధకులకు, విద్యార్థులకు, సహృదయ పాఠకులకు ఈ గ్రంథం ఒక ఆధారగ్రంథంగా ఉపయోగపడుతుంది.

